Radio LIVE


Breaking News

Saturday, 12 April 2014

ఆలేర్ నియోజకవర్గం - సమీక్ష

నల్గొండ జిల్లాలో ఉన్న ఆలేర్ నియోజకవర్గం రాజకీయాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మరియు ఇండిపెండెంట్ లు రెండు సార్లు గెలవగా పీడీఎఫ్, సీపీఐ,కాంగ్రెస్(ఐ) మరియు తెరాస తలా ఒక్కోసారి ఇక్కడ గెలుపొందాయి.
 ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి 1957 లో ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ పార్టీకి చెందిన ఆరుట్ల కమలాదేవి కాంగ్రేస్ అభ్యర్థి పున్నా రెడ్డి మీద విజయం సాధించి ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గ మొదటి  మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయుధ పోరాట నేపధ్యం ఉన్న ఆరుట్ల కమలాదేవి నిజం వెన్నుల్లో వణుకు పుట్టించిన వీర వనిత.
1962 ఎన్నికల్లో సీపీఐ తరుపున పోటీ చేసిన కమలదేవినే మళ్ళీ ఆలేరు ప్రజలు ఎన్నుకున్నారు. 1967 లో రాజకీయాలనుండి ఆరుట్ల కమలాదేవి తప్పుకుంది. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పున్నా రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచాడు,72 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుండి పోటీ చేసి పున్నా రెడ్డి గెలుపొందడం జరిగింది.
1978 సంవత్సరంలో కాంగ్రెస్(ఐ) నుండి పోటీ చేసిన సల్లూరి పోచయ్య గెలిచాడు. 1983 లో జరిగిన ఎన్నికల నుండి ఆలేరు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో మొదటి సారిగా మోత్కుపల్లి నర్సింహులు జయకేతనం ఎగురవేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మోత్కుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి పోచయ్య పై గెలుపొందాడు. ఇక మోత్కుపల్లి వెనక్కి తిరిగి చూడలేదు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు వరుసగా 5సార్లు మోత్కుపల్లికే పట్టం కట్టారు. అయితే 1983లో ఇండిపెండెంట్ గా గెలిచినా మోత్కుపల్లి 1985లో టీడీపీ నుండి,1989లో మళ్ళీ ఇండిపెండెంట్ గా,1994లో టీడీపీ నుండి 1999లో కాంగ్రెస్ నుండి గెలుపొందాడు.
మోత్కుపల్లి 5సంవత్సరాల విజయపరంపరకు 2004 సంవత్సరంలో తెరాస అడ్డుకట్ట వేసింది. కాంగ్రెస్ నుండి టీడీపీ లోకి వచ్చిన మోత్కుపల్లి 2004 ఎన్నికల్లో డాక్టర్. కుందూరు నగేష్(తెరాస) చేతిలో 24825 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇక 2009 ఎన్నికల విషయానికి వస్తే ఏకంగా ఆలేరు నియోజకవర్గం నుండి 18మంది పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బూడిద బిక్షమయ్య తెరాస అభ్యర్థి కళ్ళెం యాదగిరి రెడ్డి మీద గెలిచాడు.
2014 ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ నుండి బిక్షమయ్య గౌడ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తెరాస పార్టీ నుండి సునీత మహేందర్ రెడ్డి పోటి చేస్తుంది. తెలంగాణా తీసుకొచ్చాం కాబట్టి మేమే గెలుస్తామని తెరాస గెలుపు పై ధీమాగా ఉంది. బీజీపీ అభ్యర్థి కాసం వేంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.
ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఎమ్. తుర్కపల్లి, రాజాపేట్,యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల,ఆత్మకూరు(ఎమ్) మరియు బొమ్మల రామారం మండలాలు వస్తాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates