కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో జరుగుతున్న నాలుగవ వన్డేలో భారత్ 405 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది.భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు.ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా ఏకంగా 264 పరుగులు సాధించాడు.ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ ను కట్టడి చేయడం శ్రీలంక బౌలర్ల తరం కాలేదు.వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది రెండో డబుల్ సెంచరీ,ఇది వరకు ఆస్ట్రేలియా మీద 209 పరుగులతో తన మొదటి డబుల్ సెంచరీని సాధించిన విషయం తెలిసిందే.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది.శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చి రోహిత్ శర్మను చివరి రెండు వన్డేలకు ఎంపిక చేశారు సెలెక్టర్లు.రహనే,రోహిత్ లు ఓపెనర్లుగా వచ్చారు.మొదట్లో రహనే ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు.కాని రోహిత్ శర్మ మొదట్లో నెమ్మదిగా ఆడుతూ క్రీజ్ లో పాతుకుపోయాడు.జట్టు స్కోరు 40 పరుల వద్ద రహనే 28 పరుగులు చేసి వెనుదిరిగాడు.
తరువాత వచ్చిన రాయుడు(8) కూడా తక్కువ పరుగులకే పెవీలియన్ బాట పట్టాడు.కెప్టెన్ కోహ్లి రోహిత్ కు జత కావడంతో స్కోరు వేగం ఇక్కడినుండి పుంజుకుంది.మొదట అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 72 బంతులు తీసుకున్న రోహిత్ తరువాత బ్యాట్ జులిపించాడు.కోహ్లి తో కలిసి మూడో వికెట్ కు 202 పరుగులు జోడించాడు రోహిత్.అందులో కోహ్లి జత చేసింది కేవలం 66 పరుగులే అంటే రోహిత్ ధాటి అర్థమౌతుంది.ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ.కోహ్లీ ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 38.5 ఓవర్లలో 261 పరుగులు.రైనా(11)అలా వచ్చి ఇలా పెవీలియన్ చేరాడు.స్కోరు అప్పటికి 40.2 ఓవర్లలో 276/4.
ఊతప్ప వచ్చాక మరింత రెచ్చిపోయాడు రోహిత్.చివరి వరకు నిలిచున్న ఈ జంట 58 బంతుల్లో 128 పరుగులు జత చేసింది.వీరి భాగస్వామ్యంలో ఉతప్ప చేసింది కేవలం 16 పరుగులే.రోహిత్ శర్మ అలవోకగా తన రెండో డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఘనత తన పేరు మీద లిఖించుకున్నాడు.రోహిత్ భాదుడుకు శ్రీలంక ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారారు.173 బంతులాడిన రోహిత్ 33 ఫోర్లు,9 సిక్సులతో 264 పరుగులు సాధించాడు.శ్రీలంక చెత్త బౌలింగ్ కు తోడు క్యాచ్ లు కూడా నేలపాలు చేశారు.రోహిత్ శర్మ 4 పరుగుల వద్ద ఉన్నప్పుడే ఔటయ్యే గండం నుండి గట్టెక్కాడు.రోహిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను పెరేరా జారవిడిచాడు.
No comments:
Post a Comment